Wednesday, 7 September 2016

ఇంటి నుంచే పార్కింగ్‌ : GHMC


ఇంటి నుంచే పార్కింగ్‌ - GHMC





హైదరాబాద్‌: రైలు... బస్సు... విమానం... సినిమా టిక్కెట్లలా హైదరాబాద్‌లో పార్కింగ్‌ ప్రాంతాలకూ ముందస్తు బుకింగ్‌ వచ్చేస్తోంది. మెట్రో నగరాల్లో పార్కింగ్‌ ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లో ఈ విధానం తెరపైకి రానుంది. ఇంటి నుంచి బయటకు వచ్చేప్పుడే వాహన చోదకులు అవసరమైన ప్రాంతంలో నిర్ణీత రుసుం చెల్లించి అనువైన ప్రాంతాన్ని ఎంపిక చేసుకునే సౌకర్యాన్ని ట్రాఫిక్‌ పోలీసులు త్వరలో అందుబాటులోకి తీసుకువస్తున్నారు.
చరవాణిలో 'స్మార్ట్‌యాప్‌' ద్వారా వాహన చోదకులు దీన్ని వినియోగించుకోవచ్చు. వాణిజ్య ప్రాంతాల్లో కార్లు, బైకులు నిలిపేందుకు స్థలం లేకపోవడం... రహదారిపై ఐదంటే.. ఐదే నిమిషాలు వాహనాన్ని నిలిపితే పోలీసులు చలానా విధించడం... పిల్లాపాపలు.. కుటుంబ సభ్యులతో షాపింగ్‌, భోజనం, షికారుకు వచ్చేప్పుడు ఆయా ప్రాంతాలకు వెళ్లగానే అక్కడ వాహనాలు నిండుగా ఉండడం వంటి వాటిని దృష్టిలో ఉంచుకుని పోలీసు ఉన్నతాధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. మొబైల్‌ యాప్‌ ద్వారా సేవలందించే సంస్థలను గుర్తించేందుకు ఇటీవలే ముంబయిలో జరిగిన ట్రాఫిక్‌ ఎక్స్‌పోకు వెళ్లారు. అక్కడ తమ ప్రతిపాదనలను కార్పొరేట్‌ కంపెనీలకు వివరించారు.
కొత్త ప్రాంతాలు, జీహెచ్‌ఎంసీ స్థలాలు.. 
నగరంలో పార్కింగ్‌ ప్రాంతాల్లో అడ్డగోలుగా వసూలు చేస్తున్నారంటూ వాహన చోదకులు, కొన్ని సంస్థల నుంచి ఫిర్యాదులు రావడంతో ట్రాఫిక్‌ ఉన్నతాధికారులు జీహెచ్‌ఎంసీ అధికారులతో చర్చించి అధిక మొత్తం వసూలు చేస్తున్న వారి కాంట్రాక్టను రద్దు చేయించారు. సుమారు 200 ప్రాంతాల్లో ఉచితంగా పార్కింగ్‌ సౌకర్యం కల్పించారు. కొత్తగా మరికొన్ని ప్రాంతాలతో పాటు ప్రైవేటు స్థలాల్లో పార్కింగ్‌ రుసుం వసూలు చేస్తున్నారు. వీటన్నింటినీ పరిశీలించిన ట్రాఫిక్‌ అధికారులు ప్రైవేటు స్థలాలకు సమీపంలో జీహెచ్‌ఎంసీ స్థలాలను గుర్తించారు. ఇలా కొత్తగా వచ్చిన వాటిలో దాదాపుగా 1,080 ప్రాంతాల్లో వాహనాలు నిలిపేందుకు వీలు కల్పించేలా ప్రణాళిక సిద్ధం చేశారు. మరోమారు చర్చించాక అధికారికంగా ఖరారు చేయనున్నారు.


చరవాణి ద్వారానే అన్నీ... 
చరవాణిద్వారా 'స్మార్ట్‌యాప్‌' డౌన్‌లోడ్‌ చేసుకున్న అనంతరం ద్విచక్ర వాహనం, కార్లు, ఆటోలు ఇతర వాహన చోదకులు వాణిజ్య ప్రాంతాలు, బహుళ అంతస్థుల భవనాలు, ప్రభుత్వ కళాశాలలు, బహిరంగ ప్రదేశాలన్నీ యాప్‌లో ఉంటాయి. వీటిలో వాహన చోదకులు ఎంచుకున్న ప్రాంతాల్లో వాహనాలు నిలిపే స్థలం ఉందా?లేదా? అన్నది తెలుస్తుంది. సమీపంలో ప్రత్యామ్నాయ ప్రాంతాలున్నాయా? లేదా? రద్దీగా ఉంటే ఎంతసేపటిలో ఖాళీ అయ్యే అవకాశాలు ఉన్నాయన్న సమాచారం మొబైల్‌ యాప్‌లో ఉంటుంది. ఉదాహరణకు బంజారాహిల్స్‌లో ఉంటున్న వ్యక్తి కారులో పిల్లలను తీసుకుని ఆబిడ్స్‌లో వస్తువులు కొనుగోలు చేయాలనుకుంటే... ఇంటి నుంచి బయలు దేరేప్పుడే యాప్‌ ద్వారా వాహనం నిలిపే స్థలాన్ని ముందస్తుగా తీసుకోవచ్చు. సదరు వ్యక్తి అక్కడికి చేరుకోగానే వాహనం కోసం స్థలం ఉంటుంది. నిర్ణీత రుసుం చెల్లించి ఆయా ప్రాంతంలో ఉన్న రద్దీ దృష్ట్యా 15 నిముషాల నుంచి గంట వరకూ ఉండొచ్చు. ప్రవేటు సంస్థల్లా రద్దీ సమయాల్లో ఎక్కువ ధరలు, 30 నిముషాలు దాటితే రెట్టింపు రుసుం వంటి షరతులుండవు.

కమాండ్‌ కంట్రోల్‌ నుంచి పర్యవేక్షణ 
స్మార్ట్‌యాప్‌ ద్వారా పార్కింగ్‌ ప్రాంతాల్లో ఏం జరుగుతోందన్నది కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచీ పర్యవేక్షించవచ్చు. వాహన చోదకులు ఏవైనా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా... రుసుం తీసుకునే విషయంలో అధికంగా వసూలు చేసినా, వాహన చోదకులతో దురుసుగా ప్రవర్తించినా వెంటనే అక్కడున్న సిబ్బందిపై చర్యలు చేపట్టనున్నారు. పార్కింగ్‌ ప్రాంతాల వద్ద నేరుగా డబ్బు వసూలు చేయకుండా మొబైల్‌ యాప్‌ ద్వారా చెల్లించే వెసులుబాటు కల్పించనున్నారు. ఈ విధానం వాహన చోదకులకు ప్రయోజనకరంగా ఉంటుందని అదనపు పోలీసు కమిషనర్‌(ట్రాఫిక్‌) జితేందర్‌ తెలిపారు. పార్కింగ్‌ ప్రాంతాల్లో వాహనాలు నిలిపేందుకు ప్రత్యేక గీతలుంటాయని, అంతిమంగా పార్కింగ్‌ ప్రాంతాల పరిసరాల్లో ట్రాఫిక్‌ చిక్కులను పరిష్కరించేందుకు ఈ కొత్త ప్రణాళికను రూపొందించామని వివరించారు.

No comments:

Post a Comment