Wednesday 7 September 2016

ఆసియాలోనే అతిపెద్ద స్టార్టప్ సదస్సు 'ఆగస్ట్ ఫెస్ట్


అద్భుత ఆవిష్కరణల కేంద్రంగా తెలంగాణ
- రాష్ట్రంలో పరిశోధనలకు ప్రాధాన్యం..
- 'ఆగస్ట్ ఫెస్ట్'లో మంత్రి కేటీఆర్

తెలంగాణను స్టార్టప్‌ల రాష్ట్రంగానే కాకుండా అద్భుత ఆవిష్కరణల కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు చెప్పారు. నగరంలోని జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో ఆసియాలోనే అతిపెద్ద స్టార్టప్ సదస్సు 'ఆగస్ట్ ఫెస్ట్'ను మంత్రి శనివారం ప్రారంభించారు. రెండు రోజుల ఈ సదస్సులో కేటీఆర్ మాట్లాడుతూ.

'నగరంలో త్వరలో రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) పేరిట ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. తద్వారా రాజధానిలోని పరిశోధన సంస్థలు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించే అవకాశం ఉంటుంది.
దేశంలోని ప్రముఖ పరిశోధన సంస్థల్లో దాదాపు 30 ఇక్కడే ఉన్నాయి. వీటి సహకారంతో రిచ్‌ను ఏర్పాటు చేస్తాం. సీసీఎంబీ, ఐఐసీటీ వంటి ప్రభుత్వ రంగ సంస్థలు మార్కెట్ అవసరాలకు అనుగుణంగా పరిశోధనలు జరపాలి. నూతన ఆవిష్కరణల ద్వారా ఉపాధి అవకాశాలు పెరగడంతో పాటు పెట్టుబడిదారులు కూడా వస్తారు. 

టీ హబ్ కేవలం స్టార్టప్‌లకే పరిమితం కాకుండా ఇతర ఇంక్యుబేటర్లు, స్టార్టప్‌లకు ఊతమిస్తోంది. రూరల్ టెక్నాలజీ పాలసీలో భాగంగా రూరల్ ఇంక్యుబేటర్లను ప్రోత్సాహిస్తాం. వరంగల్, ఖమ్మం, నిజామాబాద్ వంటి ప్రాంతాల్లో స్టార్టప్‌ల కోసం ఏర్పాట్లు చేస్తున్నాం. వాట్సప్ సంస్థను 19 బిలియన్ డాలర్లకు అమ్మారు. అది అమెరికాలో ఉండడంవల్లే అంత ప్రాధాన్యతతో భారీగా డబ్బులు రాగలిగాయి. అంతటి విలువ రావాలంటే సరైన సమయం, ప్రాంతంలో, అవసరమైన సంస్థలను నెలకొల్పాల్సిన అవసరం ఉంది' అన్నారు.
నవంబర్ 5న టీ ఫండ్.
వెంచర్ క్యాపిటలిస్టులను రాష్ట్రానికి ఆకర్షించడంతో పాటు స్టార్టప్‌లను ప్రోత్సహించే లక్ష్యంతో నవంబర్ 5న 'టీ ఫండ్'ను ప్రారంభిస్తున్నట్లు కేటీఆర్ వెల్లడించారు. టీ ఫండ్‌లో రాష్ట్ర ప్రభుత్వం కూడా గణనీయమైన మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతుందన్నారు. 'భారతీయ, తెలంగాణ స్టార్టప్‌లను ప్రపంచ స్థాయి మార్కెట్లు, వెంచర్ క్యాపిటలిస్టులకు దగ్గర చేసే ప్రయత్నాల్లో భాగంగా అక్టోబర్‌లో అమెరికా సిలికాన్ వ్యాలీలో టీ హబ్ ఔట్‌పోస్టును ప్రారంభించనున్నాం. స్టార్టప్‌ల ప్రోత్సాహానికి అనువైన వాతావరణం, మద్దతు కల్పించేందుకు ప్రయత్నిస్తున్నాం. ప్రపంచవ్యాప్తంగా పేరొందిన వాణిజ్య సంస్థలు తమ ఉత్పత్తుల నాణ్యత పెంచుకునే ప్రయత్నాలు చేస్తున్నాయి. అందుకు అవసరమైన మానవ వనరులు రాష్ట్రంలో ఉన్నాయి. వచ్చే ఆగస్టు ఫెస్ట్ నాటికి వెంచర్ క్యాపిటలిస్టులు మరింత మందిని ఆహ్వానిస్తాం' అని కేటీఆర్ చెప్పారు. సమావేశంలో ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్‌రంజన్, ఆగస్ట్ ఫెస్ట్ నిర్వాహకుడు కిరణ్ తదితరులు పాల్గొన్నారు.
టీమ్ వర్క్ తోనే విజయం.
1998లో ఆన్‌లైన్‌లో ఈ కామర్స్‌ను పనిచేయడం ప్రారంభించామని, మొదటి ఏడాది రోజుకు 50 ఆర్డర్లే వచ్చేవని, ప్రస్తుతం 2.5 మిలియన్ ఆర్టర్లు వస్తున్నాయని మార్ట్‌జాక్ సంస్థ సీఈఓ అభయ్ దేశ్‌పాండే చెప్పారు. సంస్థలో ఉద్యోగులు, అధికారులు ఒక జట్టుగా పనిచేయడంవల్లే ఇది సాధ్యమైందన్నారు. ప్రారంభ దశలో ఎన్నో ఇబ్బందులు పడ్డామని, తరువాత నేరుగా ప్రయాణికులతో అనుసంధానం చేసుకోవడంవల్ల పదేళ్ల కాలంలో దేశంలో అతిపెద్ద టికెట్ అమ్మకాల సంస్థగా మారిందని రెడ్‌బస్ వ్యవస్థాపకుడు ఫణీంద్ర సామ తెలిపారు. ఫెస్ట్‌లో వందకు పైగా స్టార్టప్ సంస్థల ఉత్పత్తులు ఆకట్టుకున్నాయి.

No comments:

Post a Comment