Wednesday 7 September 2016

యాదాద్రి టెంపుల్ సిటీ లేఅవుట్లు, డిజైన్లను పరిశీలించిన సీఎం



యాదాద్రి దేవస్థానంపై సీఎం కేసీఆర్ సమీక్ష
భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది
భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు
850 ఎకరాల విస్తీర్ణంలో టెంపుల్ సిటీ
వెళ్లేందుకు, వచ్చేందుకు రహదారులు నిర్మించాలి
గుట్టను ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దాలి
హైదరాబాద్ : నల్లగొండ జిల్లాలోని యాదాద్రి దేవస్థానం అభివృద్ధి పనులపై సంబంధిత అధికారులతో ముఖ్యమంత్రి కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశానికి మంత్రి జగదీష్‌రెడ్డి, ఎంపీ బూర నర్సయ్యగౌడ్, వైటీడీఏ స్పెషల్ ఆఫీసర్ కిషన్‌రావుతో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా టెంపుల్ సిటీ లేఅవుట్లు, డిజైన్లను సీఎం పరిశీలించారు.
అనంతరం సీఎం మాట్లాడుతూ.. 'యాదాద్రిని అద్భుత పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దుతున్నందున రానున్న కాలంలో భక్తుల రద్దీ భారీగా పెరిగే అవకాశం ఉంది. భక్తుల రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు చేయాలి. 850 ఎకరాల విస్తీర్ణంలో దేవాలయ నగరం ఏర్పాటు చేయాలి. కాటేజీలు, విశాలమైన రోడ్లు, పార్కింగ్, ఉద్యానవనాలు, పుట్‌పాత్‌లు, ఫుడ్‌కోర్టులు, ఇన్ఫర్మేషన్ కోర్టులు ఏర్పాటు చేయాలి. మొదటి దశలో 250 ఎకరాల విస్తీర్ణంలో చేపట్టాల్సిన పనుల నమూనాలను ఖరారు చేశాం.
86 ఎకరాల విస్తీర్ణంలో 200 కాటేజీలు, మూడున్నర ఎకరాల విస్తీర్ణంలో ఫుడ్‌కోర్టులు, 7 ఎకరాల విస్తీర్ణంలో మంచినీరు, మరుగు నీటి నిర్వహణ వ్యవస్థ, 12 ఎకరాల్లో గ్రీనరీ, 62 ఎకరాల్లో రోడ్లు, 26 ఎకరాల్లో ల్యాండ్ స్కేపింగ్, 42 ఎకరాల గుట్ట ప్రాంతాన్ని ప్రకృతి రమణీయంగా తీర్చిదిద్దాలి. యాదాద్రిలో కాటేజీలు నిర్మించడానికి సింగరేణి, జెన్‌కోతో పాటు దేశ వ్యాప్తంగా కార్పొరేట్ కంపెనీలు ముందుకొస్తున్నాయి. కంపెనీలకు కేటాయించిన 1000-1500 గజాల ఓపెన్ ప్లాట్లను సిద్ధం చేయాలి. కాటేజీలు నిర్మించే ప్రాంతంలో రోడ్లు, విద్యుత్, మంచినీటి సౌకర్యం కల్పించాలి.
ప్రధాన ఆలయానికి వెళ్లేందుకు, వచ్చేందుకు రెండు వేర్వేరు రహదారులు నిర్మించాలి. ప్రస్తుతం ఉన్న దారిని గుట్టపైకి వెళ్లేందుకు, గుట్ట కిందకు వచ్చేందుకు కొత్త రహదారిని నిర్మించాలి. భక్తులను గుట్టపైకి తీసుకెళ్లేందుకు ప్రత్యేక రవాణా సదుపాయం కల్పించే యోచనలో ఉన్నాం. నిర్మాణాలు పూర్తయ్యాక నిర్వహణ బాధ్యతలు చూసేందుకు అవసరమైన వ్యూహం ఖరారు చేయాలి. యాదాద్రి పనులను నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు ఎప్పటికప్పుడు సమీక్షించాలి అని సీఎం ఆదేశించారు.

No comments:

Post a Comment