Wednesday 7 September 2016

రైతులకు మెరుగైన సేవలు అందిస్తాం : మంత్రి హరీష్ రావు


రైతులకు మరింత మెరుగైన సేవలు అందిస్తాం
జాతీయ వ్యవసాయ మార్కెట్-నామ్ వర్క్ షాప్ బంజారాహిల్స్ లోని అడ్మినిస్ట్రేటివ్ స్టాప్ కాలేజ్ ఆఫ్ ఇండియాలో ప్రారంభమైంది. నామ్ వర్క్ షాప్ ను మార్కెటింగ్ శాఖ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ వర్క్ షాప్ కు పది జిల్లాల మార్కెటింగ్ శాఖ అధికారులు హాజరయ్యారు. రైతులకు మెరుగైన సేవలందించడానికి మార్కెటింగ్ శాఖ, ఆస్కి ల మధ్య ఒప్పందం కుదిరింది. 44 వ్యవసాయ మార్కెట్లలో నామ్ అమలు కానుంది. దీని ద్వారా దేశంలోని ఏ వ్యాపారైనా ఆన్ లైన్ లో రైతుల వద్దనుంచి పంటను కొనే అవకాశం లభించనుంది. ఫలితంగా రైతుకు మద్దతుధర దొరకనుంది.
రైతులకు మరింత మెరుగైన సేవలు అందించడమే మార్కెటింగ్ శాఖ లక్ష్యమని మంత్రి హరీష్ రావు అన్నారు. రైతు బజార్లను మరింత పటిష్టం చేస్తామన్నారు. ప్రతి రెవెన్యూ డివిజన్, నియోజకవర్గ కేంద్రంలో రైతు బజార్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. కూరగాయాలు, పండ్లు నిల్వ చేసేందుకు కోల్డ్ స్టోరేజ్ లు ఏర్పాటు చేస్తామన్నారు.
నాణ్యమైన పంటలతో రైతులకు రెట్టింపు ఆదాయం వస్తుందని హరీష్ రావు అన్నారు. మార్కెటింగ్ శాఖ లో సాంకేతికతను ఉపయోగించి సేవలను విస్తరించేందుకు కృషిచేయాలన్నారు. పెసర్ల అంశంపై కేంద్రంతో చర్చించామని, కేంద్ర ప్రభుత్వ సంస్థలు మద్దతు ధర చెల్లించి కొనడానికి ముందుకు వస్తున్నాయని చెప్పారు. తొందరపడి రైతులు పెసర్లను వ్యాపారులకు అమ్మొద్దని మంత్రి సూచించారు. రెండుమూడు రోజుల్లోనే కేంద్రం పెసర్లను కొంటుందని తెలిపారు.
రెండు రోజుల పాటు జరుగనున్న వర్క్ షాప్ లో నామ్ పై మార్కెటింగ్ శాఖ అధికారులకు శిక్షణ ఇవ్వనున్నారు.

No comments:

Post a Comment