Saturday 10 September 2016

చావడానికి సిద్ధం: చంద్రబాబు-వెంకయ్యకు పవన్ కళ్యాణ్ కౌంటర్


అమరావతి: జనసేన పార్టీ అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ టీవీ ఛానల్ ఇంటర్వ్యూలో బీజేపీకి ధీటైన సమాధానం ఇచ్చారు. హోదా వల్ల ఎలాంటి ప్రయోజనాలు లేనప్పుడు ఎందుకు హామీ ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. ప్రత్యేక హోదా బీజేపీ వాళ్లే కావాలంటారని, మళ్లీ వాళ్లే వద్దంటారని అన్నారు.
ఓ సందర్భంలో ఆయన మాట్లాడుతూ.. తాను చావడానికైనా సిద్ధమన్నారు. ప్రత్యేక హోదా పైన ఇచ్చిన మాట తప్పవద్దన్నారు. హోదా వల్ల ప్రయోజనం లేనప్పుడు విభజన సమయంలో ఎందుకు అడిగారో చెప్పాలని నిలదీశారు. ఆయన బీజేపీ నేత వెంకయ్యను, సీఎం చంద్రబాబును నిలదీసారు.
నాయకులు నిస్సిగ్గుగా అబద్ధాలు చెబుతూ ఇలా మాటలు మార్చేస్తుంటే ఏం చేయగలమన్నారు. ఒక్కోసారి ఒక్కో మాట చెబుతుంటే ప్రజలు ఎలా నమ్మాలన్నారు. హోదా ఇవ్వమని, హోదా వల్ల ఎలాంటి ఉపయోగం లేదని ఎన్నికల సమయంలో ఎందుకు చెప్పలేదో చెప్పాలన్నారు.
హోదా తెచ్చేస్తానని వెంకయ్య ఎందుకు ఆ రోజు చెప్పారు? హోదా రాష్ట్రానికి తీసుకొచ్చే బాధ్యత తనది అని చంద్రబాబు ఎందుకు అన్నారు? అని నిలదీశారు.
తల్లిని చంపి, బిడ్డను బతికించారని, కహోదా కల్పించి ఏపీని ఆదుకుంటా'మని మోడీ ఎన్నికల ప్రచారంలో ఎందుకు చెప్పారన్నారు. ఆ రోజు చెప్పారు కాబట్టే వారిని నిలదీస్తున్నామన్నారు. ఓట్లడిగినప్పుడు అందరికీ అర్థమయ్యేలా, ఇచ్చేటప్పుడు అర్థం కాకుండా మాట్లాడుతారన్నారు.
ఎంతో మంది ఐఏఎస్‌లు తనతో మాట్లాడుతూ... పార్లమెంటులోను, కేంద్రమంత్రుల దగ్గర మన ఏపీ ఎంపీలు ఏమీ మాట్లాడరని చెప్పారని, కాంట్రాక్టులు, సొంత పనుల గురించి మాత్రమే ఎంతో మాట్లాడుతారని, అలాంటి వారు రాష్ట్రం దగ్గరికి వచ్చేసరికి నోరు మూసుకుని ఉంటారని వారు తనతో అన్నారని చెప్పారు.
ఇవన్నీ నేను చెబితే నిరూపించమంటారని, అది ఎలా సాధ్యమన్నారు. ఒకవేళ అలా నిరూపిస్తే ఏం చేస్తారు.. మహా అయితే రాజీనామా చేస్తారన్నారు. అంతకుమించి ఏం చేస్తారన్నారు. బిజెపి, టిడిపి నేతలే తనపై విమర్శలు చేస్తుంటారని పవన్ కళ్యాణ్ అన్నారు.
టిడిపి, బిజెపి నేతలే హోదా కావాలంటారని, మళ్లీ వారే ప్యాకేజీ ముద్దు అని చెబుతారని ఇదేమిటన్నారు. వాళ్లు అడిగిందే తాను అంటే విమర్శలు చేస్తున్నారని నన్ను తిడతారని వ్యాఖ్యానించారు. కేంద్రం ఏపీకి ఏం చేయడం లేదని, రాష్ట్రం కష్టాల్లో ఉందని చంద్రబాబు పదేపదే ఎందుకు చెబుతున్నారని ప్రశ్నించారు.
చంద్రబాబు చెబుతున్నట్టు ఆయన ప్రాక్టికల్ మనిషే అయితే ఈ రెండేళ్ల కాలం ఎందుకు వృథా చేశారని నిలదీశారు. రెండేళ్ల ముందే ఈ ప్యాకేజీ తీసుకుని ఉండి ఉంటే ఈ సమయం కలిసి వచ్చేదన్నారు. కడుపు మండడంతోనే సభలు, సమావేశాల్లో ఉద్వేగంగా, ఆవేశంతో, ఆవేదనతో మాట్లాడుతానని చెప్పారు.
తాను మాత్రమే ఆవేశపడతానని, తన కార్యకర్తలు, అభిమానులను మాత్రం సంయమనంతో వ్యవహరించమని చెబుతానన్నారు. వారు కూడా తనలా ఆవేశపడితే ఎంత నష్టం జరుగుతుందో తనకు తెలుసునని చెప్పారు. దేశం మారాలని కోరుకునే కొత్త జనరేషన్ ఉందని, వారితోనే ప్రపంచం మొత్తం కలుస్తుందని, వారికి ప్రతినిధులుగా ప్రజలు నిలబడాల్సిన అవసరం ఉందన్నారు.

No comments:

Post a Comment